ఆర్ధిక శాస్త్రవేత్త... మన్మోహన్ సింగ్..


ఆర్ధిక శాస్త్రవేత్త... మన్మోహన్ సింగ్...



రాజకీయ నాయకుడు కానీ నాయకుడు, ఆర్ధికరంగ శాస్త్రవేత్త…. దేశాన్ని తన ఆర్ధిక శాస్త్ర మేధస్సుతో సంక్షోభం నుండి కాపాడిన ఆపద్బాంధవుడు. ప్రతిపక్షాలు మౌన మోహన్ సింగ్ అని అవహేళన చేసిన కూడా ఒక్కమాట అనకుండా అన్నీ భరించిన హుందా కలిగిన నేత.
జీవితం ప్రారంభం నుండి రాజకీయాలు ఆహ్వనిస్తున్నా కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ తనకిష్టమైన ఉపాధ్యాయ వృత్తినే నమ్ముకున్న వ్యక్తి. సాక్షాత్తు మన దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు స్వయంగా ఆహ్వానించినా కూడా రాజకీయాల్లో అడుగు పెట్టని వ్యక్తి. కానీ దేశానికి తన సేవలు అవసరం అని గ్రహించి కొన్ని కీలక పదవులు చేపట్టడానికి మాత్రం అంగీకరించాడు. 1990 వ దశకంలో దేశంలో ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం వలన మన్మోహన్ సింగ్ రాజకీయాల్లోకి రాక తప్పలేదు. 1991 లో ప్రధాని అయిన పీవీ నర్సింహా రావు ఆర్ధిక మంత్రిగా మన్మోహన్ సింగ్ అయితే దేశం సంక్షోభం నుండి బయటపడుతుందని గ్రహించి మన్మోహన్ సింగ్ ని ఆర్ధికమంత్రిగా నియమించాడు. తరువాత అంచెలంచలుగా ఎదుగుతూ దేశ ప్రధాని మంత్రి అయ్యారు మన్మోహన్ సింగ్. దశాబ్దం పాటు దేశానికి ప్రధానిగా సేవలందించి జాతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు.



●జననం
మన్మోహన్ సింగ్ స్వాతంత్య్రం సిద్దించక ముందు పంజాబ్ రాష్ట్రంలోని గాహ్ అనే గ్రామంలో గురముఖ్ సింగ్ మరియు అమ్రిత్ కౌర్ దంపతులకు 26 సెప్టెంబర్ 1932న జన్మించారు. 1947 లో స్వతంత్రం వచ్చిన తరువాత ఇండియా - పాకిస్తాన్‌లు విడిపోతున్న సమయంలో మన్మోహన్ సింగ్ కుటుంబం అమృత్‌సర్‌కు వచ్చారు. గాహ్ ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో ఉంది. బాల్యం నుండి చదువులో చురుగ్గా ఉండే మన్మోహన్ సింగ్ కు చిన్నపుడు కిరోసిన్ ద్వీపం క్రింద చదువుకున్న చరిత్ర ఉంది.
●విద్యాభ్యాసం
మన దేశం ఇప్పటి వరకు చూసిన అందరు ప్రధానమంత్రుల కంటే మన్మోహన్ సింగ్ అత్యంత ఎక్కువ చదువుకున్న వ్యక్తి. మన్మోహన్ సింగ్ ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ధిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు. అనేక విశ్వవిద్యాలయాలు మన్మోహన్ సింగ్‌కు గౌరవ డాక్టరేట్లు అందించాయి.
● పొలిటికల్ కెరీర్
విద్యాభ్యాసం పూర్తి చేసి ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగం చేస్తున్న మన్మోహన్ సింగ్‌కు ఢిల్లీ యూనివర్సిటీలో ఆర్ధిక శాస్త్ర అధ్యాపకుడిగా ఉద్యోగం రావడంతో ఐక్యరాజ్య సమితి ఉద్యోగం వదిలేసి వచ్చాడు. తరువాత మన దేశ ప్రభుత్వంలో 1970 మరియు 1980 దశకాలలో ఎన్నో కీలక పదవులలో బాధ్యతలు నిర్వహించారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైసర్, రిజర్వు బ్యాంకు గవర్నర్, ప్లానింగ్ కమిషన్ అధ్యక్షుడిగా ఇలా అనేక కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్ సింగ్ అధ్యాపక వృత్తిలో ఉన్న సమయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని కలవడం జరిగింది. అప్పుడు జవహర్ లాల్ నెహ్రు మన్మోహన్ సింగ్ మేధస్సుని గుర్తించి రాజకీయాల్లోకి ఆహ్వానించాడు కానీ మన్మోహన్ సింగ్ సున్నితంగా తిరస్కరించాడు. తరువాత 1991 లో పీవీ నర్సింహా రావు మన దేశ ప్రధాని అయ్యాక మన్మోహన్ సింగ్‌కు ఆర్ధిక మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మన్మోహన్ సింగ్ కు రాజకీయాల్లోకి రాక తప్పలేదు.

●ప్రధానిగా మన్మోహన్ సింగ్
1991 లో ఆర్ధిక మంత్రి అయినా మన్మోహన్ సింగ్ అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ప్రధానమంత్రి అయ్యారు మన్మోహన్ సింగ్. ఉపాధి హామీ పథకం మరియు సమాచార హక్కు చట్టం వంటి కీలక చట్టాలు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొని రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగింది. ప్రధానమంత్రి అయినా మొదటి సిక్కు మన్మోహన్ సింగ్. ఐదు సంవత్సరాలు ప్రధానిగా కొనసాగి మళ్ళీ వెంటనే రెండవ పర్యాయం ప్రధాని అయినా రెండవ వ్యక్తి మన్మోహన్ సింగ్. జవహర్ లాల్ నెహ్రు మొదటి వ్యక్తి. మన్మోహన్ సింగ్ కు హిందీ చదవడం రాదు కావున తన ప్రసంగాలను ఉర్దూలో రాసుకునే వారు మన్మోహన్ సింగ్. తన ప్రతీ హిందీ ప్రసంగానికి ముందు కొంత సమయం సాధన చేసేవారు.
● ప్రస్తుతం
ప్రస్తుతం మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొంటున్న ఆర్ధిక నిర్ణయాలలోని అవకతవకలను ఎండగడుతున్నారు. మోదీ ప్రభుత్వం చేసిన నోట్ల రద్దు విధానాన్ని రాజ్య సభ సాక్షిగా ఎండగట్టారు మన్మోహన్ సింగ్. అలాగే జిఎస్‌టి లోని అవకతవకల మీద ఘాటుగా స్పందించారు. ఎన్నో కీలక పదవులలో కొనసాగిన మన్మోహన్ సింగ్ ఈ రోజు 86 వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.


No comments

Powered by Blogger.