కేసీఆర్ ఆ రోజు ఎం మాట ఇచ్చావో గుర్తుందా...??



కేసీఆర్ ఆ రోజు ఎం మాట ఇచ్చావో గుర్తుందా...??


యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం వర్టూరు దళితవాడ ప్రజలు గుర్తున్నారా కెసిఆర్ దొరా? 2008 ఏప్రిల్‌ 14న పల్లె నిద్ర కార్యక్రమానికి వెళ్ళిన మిమ్మల్ని ఆదరించి అన్నం పెట్టిన దళితవాడ అది. ఆరోజు ఇల్లు ఇల్లు తిరిగి ప్రతి ఇంటికి బర్రెను కొనిస్తానన్నారు. ప్రతి పేద దళితులకు ఉపాధి ఏర్పాట్లు చేస్తానన్నారు. ప్రతి కుటుంబానికి ఇండ్లు కట్టిస్తానన్నారు. భూమి లేని దళితులకు భూ పంపిణీ చేస్తానన్నారు. వ్యవసాయం కోసం బోరు వేయిస్తానని ఇలా నోటికొచ్చిన ఎన్నెన్నో హామీలిచ్చారు. 



అడెపు బుచ్చమ్మ, లక్ష్మయ్యలు గుర్తున్నరా సారూ? పడుకోడానికి స్థలం లేక వాళ్ళు పొయ్యి దగ్గర పడుకొని మిమ్మల్ని ఇంట్లో పడుకోబెట్టారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక వారు మిమ్మల్ని కలవాలని మీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వట్లేదు మీరు. దళితవాడ నుండి ఎక్కువ మార్కులు వచ్చి 7వ తరగతి చదువుతున్న ఆనాటి చిన్నారి ఆడెపు వెన్నెలను డాక్టరును చేస్తానన్నారు. తాత్కాలికంగా రూ.25,000 ఇస్తానన్నారు. ఆ వెన్నెలకు డాక్టర్‌ చదివే ఆర్థిక స్థోమత లేక జీఎన్‌ఎం పూర్తి చేసి ప్రస్తుతం బీఎస్సీ (నర్సింగ్‌) చేస్తోంది.



ఇక మీరు నిద్ర చేసిన పల్లె ఎట్టుందో తెలుసా? ఇంటింటికో సమస్య. ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి కుటుంబాలను పోషించే పరిస్థితి. చనిపోయిన వారిని బొంద పెట్టే స్థలమూ లేదు. ప్రభుత్వం ప్రకటించిన దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ కోసం నియోజకవర్గంలో మొదటి గ్రామంగా ఎంపికైనట్టు ఆర్భాటంగా ప్రకటించారే తప్ప భూపంపిణీ చేయలేదు. గ్రామంలో ఉన్న తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం విద్య లేనందున ఒక విద్యార్థికి రూ.2వేల చొప్పున సంవత్సరానికి చెల్లిస్తూ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం టీచర్‌ను నియమించుకొని చదువు చెప్పిస్తున్నారు. ఏరుదాటాక తెప్పతగలేసే నైజం ఉన్న కెసిఆర్ చివరకు దళితులను కూడా మోసం చేస్తారనుకోలేదని వర్టూరు గ్రామస్తులు అంటున్నారు.

No comments

Powered by Blogger.